హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతానికి పెంచాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా నేతన్నలు కన్నెర్ర చేశారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద బుధవారం హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించి నిరసన తెలిపారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే నేతన్నలను ఆత్మహత్యలకు పురిగొల్పడమేనా? అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మార్చ్‌లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, సినీనటి పూనమ్‌కౌర్ పాల్గొని మద్దతు తెలిపారు. ‘నేతన్న నేస్తం’, ‘చేనేతకు చేయూత’ కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకొని వారి ఆత్మహత్యలను నివారించిందని రమణ గుర్తుచేశారు. చేనేతను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొంటున్న ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్లకు నేతన్నలపై నిజంగానే ప్రేమ ఉంటే వారికి ఆరోగ్య, గుర్తింపు కార్డులు ఇవ్వాలని పూనమ్‌కౌర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం హ్యాండ్లూమ్ విభాగ్ చైర్మన్ ఎర్రమద వెంకన్న నేత, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం, ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.