Srisailam | శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధజలాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు చేసినట్లు ఈవో చంద్రశేఖర ఆజాద్ తెలిపారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడంతో భూతప్రేత పిశాచ దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో పరోక్షసేవ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. శ్రీశైల టీవీ ఛానల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనునున్నట్లు తెలిపారు. వివరాల కోసం 8999901951, 2, 3, 4, 5, 6 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను సీనియర్ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆయన విరాళం ప్రకటించారు. శాశ్వత అన్న ప్రసాద వితరణకు రూ.1,00,200 విరాళాన్ని ఆలయ ఏఈఓలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఆ తర్వాత శేషవస్త్రంతో ఆయనను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు.