Congress Govt | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ‘హైడ్రా’ అవతరించిన కొద్ది రోజులకే ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను నేటమట్టం చేసింది. కోర్టు ఆదేశాలు వచ్చేలోగానే ‘సెలవుల అదును’ చూసి కూల్చివేసింది. కొంతకాలంగా తన వెనుక జరుగుతున్న వ్యవహారాలపై నాగార్జున మౌనంగానే ఉన్నా.. మరోసారి ‘అక్కినేని ఫ్యామిలీ’ లక్ష్యంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తొలి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలురుగా ఉన్న అక్కినేని కుటుంబాన్ని ఇప్పుడు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందని సినీవర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదని తెలుస్తున్నది. ‘ఎన్ కన్వెక్షన్’ కూల్చివేత వెనుక అమరావతి నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయనే వాదనలు ఇండస్ట్రీ వర్గాల్లో బాహాటంగానే వినిపిస్తున్నాయి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అనుకూలుడిగా ఇండస్ట్రీలో నాగార్జునకు పేరుందని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు పలుమార్లు ఆయనను కలిసి సమస్యలపై చర్చించారని, అయితే ఓ వర్గానికి చెందిన హీరోను లక్ష్యంగా చేసుకొని జగన్ సానుకూలంగా స్పందించలేదని, ఈ వ్యవహారంలో నాగార్జున ఎవరి పక్షం లేకున్నా ఆయన జగన్‌కు అనుకూలమనే ప్రచారం జరిగిందని, ఈ కారణంగానే ఇక్కడ రేవంత్ సీఎం కాగానే ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేతకు ఏపీ నుంచి ఆదేశాలు వచ్చాయని, ఇండస్ట్రీ కోణంలో ఇదో కక్షపూరిత చర్య అని సినీరంగానికి చెందిన ఓ ప్రముఖుడు వెల్లడించారు. ఉద్యోగాలు, రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం కారణంగా ఆదిలోనే వచ్చిన ప్రజావ్యతిరేకతను హైడ్రా కూల్చివేతలతో కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ సర్కార్, తాజాగా కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అక్కినేని కుటుంబంతో ముడిపెట్టి ‘రాజకీయం’ చేస్తున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి సురేఖ వ్యాఖ్యలతో షాక్‌లో ఇండస్ట్రీ
అగ్ర నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ లెజెండరీ సినీ కుటుంబంపై అభాండాలు వేయడం సినీ ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాగార్జున కుటుంబాన్ని రేవంత్ ప్రభుత్వం రాజకీయ పరమైన హిడెన్ ఎజెండాతో కావాలనే ఇబ్బంది పెడుతున్నదని, ఇది ఓ రకంగా ఇండస్ట్రీపై జరుగుతున్న నైతిక దాడి అని పలువురు సినీరంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో సినీరంగం స్థిరపడటానికి ప్రధాన భూమిక పోషించిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఇది అత్యంత బాధాకరమని వాపోతున్నారు. సినీరంగంలో వరుస పరిణామాలు భవిష్యత్తులో ఇండస్ట్రీ మనుగడపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
జగన్‌కు అనుకూలంగా ఉన్నాడనేనా?
రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబంతో నాగార్జున సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. నాగార్జున మేనల్లుడు సుమంత్, జగన్మోహన్రెడ్డి పాఠశాల రోజుల్లో క్లాస్మేట్స్. ఈ కారణంగా కూడా నాగార్జున, జగన్మోహన్రెడ్డి మధ్య సఖ్యత ఏర్పడిందని చెప్తారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇండస్ట్రీ సమస్యలపై పలువురు పెద్దలు కలిసి చర్చించినా ఆయన ఓ హీరోను లక్ష్యంగా చేసుకొని సానుకూలంగా స్పందించలేదనే అసంతృప్తి ఉండేది. ఈ కారణంగా సినీరంగంతో జగన్‌కు దూరం పెరిగింది. ఈ వ్యవహారంతో నాగార్జునకు ఎలాంటి సంబంధం, పక్షపాతం లేకున్నా జగన్ అనుకూలుడనే ప్రచారం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్‌లో రేవంత్‌రెడ్డి సీఎం కావడం, ఏపీలో జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమరావతి నుంచి అందిన ఆదేశాల మేరకు ‘బుల్డోజర్’ ఎన్ కన్వెన్షన్ వైపు మళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్ట్రీకి రేవంత్ బెదిరింపులు
పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలుగు సినీ రంగానికి ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి అంశంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించేవారు. 2019 ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కల్యాణ్ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారు. ‘తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా పవన్‌కల్యాణ్ ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లారు. తాను పవన్‌కల్యాణ్ అభిమానినని పొగడ్తల్లో ముంచెత్తారు. రాజకీయాలతో ఇండస్ట్రీని ముడిపెట్టకుండా కేటీఆర్ వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలందుకున్నది. అయితే రేవంత్ సర్కార్ రాకతో ఇండస్ట్రీల్లో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయని, తొలి నుంచీ ఆయన బెదిరింపు ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని పలువురు ఇండస్ట్రీకి చెందినవారు చెప్తున్నారు. సాధారణంగా సినీ తారలు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నచ్చితే స్వచ్ఛందంగా ప్రచారం చేసేందుకు ముందుకొస్తారు.
కానీ డ్రగ్స్‌పై అవగాహన పెంచే కార్యక్రమం విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో భయాలను రేకెత్తించాయి. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని, అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని, లేదంటే వారి సినిమాలకు అనుమతులు ఇవ్వబోమని ఓ సభలో సీఎం రేవంత్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ తమను ఏ ముఖ్యమంత్రి ఈ రీతిలో బెదిరించలేదని ఇండస్ట్రీవర్గాల్లో చర్చ జరిగింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సినీ ఇండస్ట్రీని ఓ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనిపిస్తోంది. నయానోభయానో మమ్మల్ని దారికి తెచ్చుకోవాలనే ధోరణి కనిపిస్తున్నది. గతంలో ఈ తరహా వైఖరిని ఏ ప్రభుత్వంలో చూడలేదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ నిర్మాత తెలిపారు.
మరింత అగ్గిరాజేసిన సురేఖ వ్యాఖ్యలు
ఇప్పటికే సర్కార్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీలో కొండా సురేఖ వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. సినీ హీరోయిన్లను అవమాన పరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అక్కినేని కుటుంబాన్ని అభాసుపాలు చేసేలా ఆమె మాట్లాడటాన్ని నాగార్జున అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినిమా వైభవానికి ఎంతగానో కృషి చేసిన లెజెండరీ అక్కినేని ఫ్యామిలీపై ఇంతలా దిగజారుడు రాజకీయాలు చేయడమేమిటని మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబం నుంచి ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి హీరోలున్నారు. ఇప్పటివరకు వీరంతా వివాదరహితులుగా పేరు తెచుకున్నారు.
అక్కినేని కుటుంబం సేవా కార్యక్రమాలపరంగా కూడా ఎప్పుడూ ముందుంటుంది. అక్కినేని అమల బ్లూక్రాస్ ద్వారా జంతు సంరక్షణకు కృషి చేస్తున్నది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కొన్ని వందల మంది సినీ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇండస్ట్రీ పిల్లర్స్‌లో ఒకటైన అక్కినేని కుటుంబాన్ని తొలుత ఎన్ కన్వెక్షన్ కూల్చివేతతో ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు కేటీఆర్‌తో ముడిపెట్టి వివాదాల్లోకి లాగుతున్నారనే చర్చ కొనసాగుతున్నది. అటు ఏపీ డైరెక్షన్లో నాగార్జున, ఇటు ప్రభుత్వ కూల్చివేతల చర్యలపై గట్టిగా పోరాడుతున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను ప్రజల్లో చులకన చేయాలనే కుట్రతోనే రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని పలువురు రాజకీయ ప్రముఖులు స్పష్టంచేస్తున్నారు. ఏదేమైనా ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని హితవుపలుకుతున్నారు.
వివాదాలకు దూరంగా అక్కినేని కుటుంబం
తొలి నుంచీ అక్కినేని ఫ్యామిలీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నది. ఏఎన్నార్ కాంగ్రెస్‌వాదిగా ఉన్నా ఆయన ఏనాడూ బాహాటంగా పార్టీని సమర్థించలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ విషయంలో ఏఎన్నార్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్న వాదనలు ఉన్నాయి. స్టూడియో లీజును రద్దు చేయించాలని ప్రయత్నించగా కోర్టుల ద్వారా ఆ వివాదం సమసిపోయింది. అనంతరకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ సఖ్యతగానే ఉన్నారు.
ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి ఎప్పుడూ రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో అక్కినేని నాగార్జున కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారు. అప్పటి ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా కూడా పనిచేశారు. అయితే ఎలాంటి రాజకీయపరమైన కార్యకలాపాల్లోగాని, పార్టీ ప్రచారంలో గాని నాగార్జున పాల్గొనలేదు. తొలినుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలురుగా ఉన్న అక్కినేని కుటుంబాన్ని ఇప్పుడు టార్గెట్ చేయడం ఏమిటని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు నేతలు రేవంత్‌రెడ్డి తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది.