హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సరిగ్గా ఏడాది కిందట కరోనా వచ్చింది.. పరీక్షలన్నీ ఆగిపోయినయ్. దేశంలో బోధన రంగం ఆన్‌లైన్‌కు మారింది. మధ్యలో కొన్ని రోజులు స్కూళ్లు, కాలేజీలవైపు అడుగులుపడ్డాయి. ఏడాది గడిచింది, మళ్లీ అదే సమస్య. రెండోవేవ్ అంటూ వచ్చిన కరోనా వల్ల పరీక్షలన్నీ ఆగిపోతున్నయ్. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఐటీఐ నుంచి ఐఐటీ వరకు, డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు అన్ని పరీక్షలు అటకెక్కుతున్నయ్. గతంలో ఇదే సమస్య. ఇప్పుడూ ఇదే సమస్య. అప్పుడూ గందరగోళమే, ఇప్పుడూ అదే పరిస్థితి. ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయాయ్. త్వరలో మరో విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో బోధన కొనసాగకుండా, పరీక్షలు రాయకుండా విద్యాసంవత్సరాలు గడిచిపోతే ప్రతిభానైపుణ్యాల మాటేమిటి? ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనా యాక్టివిటీ ఎంత ఉంది? విద్యాశాఖ ఏం చేయాలి? టీచర్లు ఎలాంటి ప్రణాళికలు రచించాలి? అన్న సమాధానాలు వెతకాలని విద్యావేత్తలు చెప్తున్నారు. ఆ దిశగా విద్యాశాఖ చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే విద్యాసంవత్సరం ప్రారంభించాలని, వారంలో రెండు రోజులు ప్రత్యక్ష తరగతులు, రెండు రోజులు ఆన్లైన్ క్లాసులు, మరో రెండు రోజులు అసైన్మెంట్లు, ప్రాజెక్టు ఇస్తూ ముందుకు సాగాలని ఎన్సీఈఆర్టీ సభ్యుడు పీ మురళీమనోహర్ సూచించారు. 4జీ, 5జీలను ఉపయోగించుకొని మూరుమాల ప్రాంతాల విద్యార్థులకూ విద్యను అందించాలని వెల్లడించారు.
ఆన్లైన్ బోధనకు టీచర్లను సన్నద్ధం చేయాలి
కరోనా ఎంతకాలముంటుందో తెలియదు. ఇప్పటికే పిల్లలు రెండేండ్లు నష్టపోయారు. ఇంకా నష్టపోయే ప్రమాదముంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా యాక్టివిటీ సరిగ్గా లేదనే వాదనలు ఉన్నాయి. అంటే.. పిల్లలకు ఆసక్తిరేపేలా, ఉత్సుకత పెంచేలా బోధన జరుగటం లేదనే అర్థం. నా మట్టుకు నేను పాఠం చెప్పిన.. నా పని అయిపోయిందన్న భావనలో టీచర్లు ఉంటున్నారు. ఇది సరికాదు. గ్రూపు డిస్కషన్లు పెట్టాలి. వీలైనంతమేర పిల్లలను భాగస్వాములను చేయాలి.
– ప్రొఫెసర్ తిరుపతిరావు, ఉస్మానియా పూర్వ వైస్‌చాన్స్‌లర్
ఆసక్తిగా వినే ఏర్పాట్లు చేయాలి
ప్రత్యక్ష తరగతి గది బోధన, ఉపాధ్యాయుడి సమక్షంలో నేర్చుకున్న దానితో పొల్చితే ఆన్లైన్ క్లాసులు అంత ప్రభావం చూపవు. ఆన్లైన్ క్లాసుల పంథాను మార్చి, విద్యార్థులు ఆసక్తిగా వినేలా బోధించేందుకు ఏర్పాట్లు చేయాలి.
– కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ