మొయినాబాద్, జూలై 8: తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందడి యాదిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకున్న నేపథ్యం లో అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం గండిపేట మండలం బైరాయిగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడంతోపాటు మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో 500 గజాల స్థలం కేటాయించిందని అన్నారు. ఈ మేరకు వారు శనివారం యాదిరెడ్డి ఇంటికి వెళ్లి వారు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటి స్థలం పత్రాలను ఆయన తల్లి చంద్రమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడటంతో యాదిరెడ్డి కల సాకారైందని అన్నారు. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు వారంలో రోజుల్లో పింఛన్ మంజూరు చేయిస్తామని, మొయినాబాద్ మండల కేంద్రంలో యాదిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు.