హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణులను కించపరుస్తూ పాటపాడిన జీడి సారయ్యపై, ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను డిమాండ్ చేశాయి. ఎక్కడికక్కడ పోలీస్స్టేషన్లలో బ్రాహ్మణ సంఘాల నేతలు ఫిర్యాదులు చేశారు. బ్రాహ్మణులను కించపరచడం ఇటీవల ప్యాషనై పోయిందని మండిపడ్డారు. బ్రాహ్మణులను దూషించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని టీబీఎస్ఎస్ఎస్ ప్రతినిధులు హెచ్చరించారు. కుల వృత్తులను ఆధారంగా చేసుకుని సామరస్యంగా జీవనం సాగిస్తున్నామని, సారయ్య వంటి వారి చేష్టలు సమాజహితానికి చేటు అని పేర్కొన్నారు. అర్చక పురోహితులుగా కులవృత్తిని చేస్తున్న వారిని హేళన చేయడం అట్రాసిటీ కిందికే వస్తుందన్నారు. వివరాల్లోకి వెళ్తే డప్పు చంద్రం సంస్మరణ సభలో జీడి సారయ్య బృందం బ్రాహ్మణ సమాజంపై పాట పాడారు.
ఇందులో బ్రాహ్మణుల ఆహార్యం, ఆహారంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేసిన వారిలో టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్‌శర్మ, కోశాధికారి సముద్రాల విజయసారథి, బోపా వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యాకరణం నాగేశ్వర్, టీబీఎస్ఎస్ఎస్ లీగల్‌సెల్ కన్వీనర్ విజయభాస్కర్, మెదక్ జిల్లా బ్రాహ్మణసంఘం అధ్యక్షుడు శలాక రాజేశ్వర్‌శర్మ, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల దేవులపల్లి వాణి, గాయత్రీ కులకర్ణి ఉన్నారు.