హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): బీ-క్యాటగిరీ సీట్లు అమ్ముకుంటున్న ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేసింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లాఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర సంయుక్తంగా మాట్లాడుతూ.. కౌన్సెలింగ్ కంటే ముందే ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల దందా జోరందుకుందని ఆరోపించారు. వివిధ బ్రాంచ్‌ల సీఏఎస్‌సీ, ఐటీ, ఈఈఈ కోర్సుల సీట్లను సగటున రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నాయని మండిపడ్డారు. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాతనే మేనేజ్మెంట్ కోటాను భర్తీ చేయాలని, కానీ కన్వీనర్ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.