మేడ్చల్, నవంబర్ 23: పెట్రోల్ బంక్ వద్ద ఒక సామాన్యుడితో అతిగా వ్యవహరించిన ఆక్టోపస్ ఏసీపీ అరుణ్‌కుమార్‌పై స్థానికులు తిరగబడ్డారు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి చెంగిచెర్లలోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ పోయించుకుని వెళ్తుండగా, ఆ వెనుక ఉన్న ఆక్టోపస్ ఏసీపీ అరుణ్‌కుమార్ కుమారుడి వాహనానికి తగిలింది. దీంతో ఏసీపీ కొడుకు కోపోద్రిక్తుడయ్యాడు.
లక్ష్మీనారాయణతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మరింత అసహనానికి గురైన ఏసీపీ కొడుకు లక్ష్మీనారాయణ బైక్‌కు ఉన్న తాళం తీసుకొని, తన తండ్రి అరుణ్‌కుమార్‌కి ఫోన్ చేశాడు. పోలీస్ వాహనంలో అక్కడకు చేరుకున్న ఏసీపీ అరుణ్‌కుమార్ వస్తూనే తిట్ల దండకం అందుకున్నారు. లక్ష్మీనారాయణతోపాటు అడ్డుగా వచ్చిన మరో వ్యక్తి గల్లా పట్టుకొని పోలీస్ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా స్థానికులు ఎదురు తిరిగారు.
బాధ్యత గల పోలీస్ అధికారి సామాన్యులపై జులుం చూపించడం ఏమిటని ప్రశ్నించడంతో ఆయన కొంత వెనక్కి తగ్గారు. ఈ దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అనంతరం ఏసీపీ తీరుపై బాధితులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.