మహబూబ్‌నగర్/అచ్చంపేట టౌన్, అక్టోబర్ 26: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కం జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. ఉదయం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను అచ్చంపేట కోర్టుకు తరలించారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు ఆయనను సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పాలమూరులోని జిల్లా జైలుకు తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో సర్వేనంబర్ 523లో ప్రభుత్వ భూమిని దొంగ పట్టాలు తయారు చేసి విక్రయించారని తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌గౌడ్ శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని తెలిపారు. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులో ఇరికించారని మీడియా ప్రతినిధులు డీఎస్పీని ప్రశ్నించగా.. తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. కాగా.. శ్రీకాంత్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున రూరల్ స్టేషన్‌కు, జిల్లా జైలు వద్దకు చేరుకున్నాయి.