పెద్దపల్లి కమాన్, మే 30: బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో కోర్టు న్యాయమూర్తి స్వప్నారాణి శనివారం తీర్పు వెలువరించారు. బసంత్‌నగర్ ఎస్ఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన రామంచకుమార్ అలియాస్ సూర్య కుమార్ 2021లో బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పడంతో బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ మహేందర్, సీఐ ప్రదీప్‌కుమార్ నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టులో నేరం రుజువుకావడంతో రామంచకుమార్కు పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.