హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): భూగర్భంలో ఎక్కడ, ఎంత నీటి మట్టం ఉన్నది? ఏ సమయంలో తగ్గిపోతున్న ది? ఎప్పుడు పెరుగుతున్నది? వంటి అంశాల ను ఎప్పటికప్పుడు కచ్చితత్వంతో లెక్కించేలా భూగర్భ జలశాఖ చర్యలు చేపట్టింది. ఆధునిక సాంకేతికత సాయంతో భూగర్భ జల మట్టా న్ని ఇప్పటికే కొలుస్తున్నది. నిర్దిష్ట ప్రాంతాల్లో బోరు బావులను తవ్వి (ఫిజో మీటర్లు), వాటి ద్వారా నెలకోసారి రీడింగులను తీసే విధానం ఇప్పటివరకు ఉండేది. ఈ ఫిజోమీటర్ స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా గతంలో 901 అందుబాటు లో ఉండేవి. తెలంగాణ వచ్చాక నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా వీటి సంఖ్య ను విస్తరిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,518 ఫిజోమీటర్లకు చేరింది.
డీడబ్ల్యూఎల్ఆర్తో జలమట్టం మదింపు..
రాష్ట్రంలోని ఫిజోమీటర్ల ద్వారా భూగర్భ జలవనరుల శాఖ ఇప్పటివరకు మాన్యువల్‌గా గ్రౌండ్ వాటర్ లెవల్స్ కొలిచేది. వాటన్నింటినీ క్రోడీకరించి జిల్లా, రాష్ట్రంలో భూగర్భ జల మ ట్టాన్ని అంచనా వేసేది. ప్రస్తుతం ఈ విధానాలకు భూగర్భ జలశాఖ స్వస్తి పలికింది. ఆటోమెటిక్ విధానంలో జలమట్టాల సేకరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రాజెక్టులు, కాలువలపై నీటి ప్రవాహాలను కొలిచేందుకు వినియోగిస్తున్న టెలీమెట్రీ వ్యవస్థను వినియోగించుకొంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫిజోమీటర్ల వద్ద డిజిటల్ వాటర్ లెవర్ రికార్డ్ (డీడబ్ల్యూఎల్‌ఆర్) టెలీమెట్రీలను బిగిస్తున్నది. ఇవి శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఫిజోమీటర్ల వద్ద ఏర్పాటుచేసిన సెన్సార్ల ద్వా రా రియల్‌టైం డాటా అక్విజైషన్ సిస్టమ్ (ఆర్టీడీఏఎస్) సాయంతో భూగర్భజల మట్టా న్ని కొలుస్తున్నారు. గతంలో నెలకోసారి ఈ రీడింగులను నమోదుచేయగా, ప్రస్తుతం ప్రతి 6 గంటలకు ఒకసారి రీడింగులను ఆటోమెటిక్‌గా తీస్తున్నారు. ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తూ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రంవారీగా, నెలవారీగా ఇప్పటికే నివేదికలను విడుదల చేస్తుండటం విశేషం.
అరచేతిలో సమాచారం
డీడబ్ల్యూఎల్‌ఆర్ ద్వారా సేకరించిన భూగర్భ జలమట్టం డాటాను అధికారులు ఎప్పటికప్పుడు తెలంగాణ భూగర్భ జల వనరులశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఈ సమాచారాన్ని రైతులకు, పౌరులందరికీ ప్రాంతాలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుతం లోకేషన్ల వారీగా ఆ అప్లికేషన్ టెస్టింగ్ చేస్తున్నారు. మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చాక.. ఏ ప్రాంతంలోని వారైనా అక్కడి జలమట్టం ఎంత లోతులో ఉన్నదనేది ఒక్క క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. గృహ అవసరాల బోర్ల వినియోగానికి కూడా ఈ సమాచారం ఉపయోగకరంగా మారనున్నది.
మొత్తం 515 డీడబ్ల్యూఎల్‌ఆర్ స్టేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా గతంలో 901 ఫిజోమీటర్లు అందుబాటులో ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత వాటికి అదనంగా, ప్రతి గ్రౌండ్ వాటర్ బేసిన్ ఏరియాలో 3 ఫిజోమీటర్లు ఏర్పాటు చేయాలని భూగర్భ జలశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అదనంగా 617 ఫిజోమీటర్లను కొత్తగా ఏర్పాటు చేసింది. గతంలోని ఫిజోమీటర్ల వద్ద కూడా డీడబ్ల్యూఎల్‌ఆర్ పరికరాలను బిగిస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటికి అదనంగా మరో 200 ఫిజోమీటర్లను ఏర్పాటు పనులను చేపట్టింది. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 100 డీడబ్ల్యూఎల్‌ఆర్ ఫిజోమీటర్లను ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే 515 ఫిజోమీటర్లను ఆధునికీకరించారు. మిగతా మానిటరింగ్ స్టేషన్ల వద్ద డీడబ్ల్యూఎల్‌ఆర్ పరికరాలను ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది.
త్వరలోనే యాప్ అందుబాటులోకి..
సమర్థంగా భూగర్భ జల వనరులను వినియోగించుకోవాలంటే నీటిమట్టం ఎంత ఉన్న దో ఎప్పటికప్పుడు తెలియాల్సి ఉన్నది. భూమి లో ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయనేది తెలిస్తే రైతులే కాదు, ఎవరైనా అందుకనుగుణంగా నీటిని పొదుపు వినియోగించుకొంటారు. దానిని దృష్టిలో పెట్టుకొని డీడబ్ల్యూఎల్ఆర్లను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే వెబ్సైట్, యాప్ ద్వారా ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే పనులు కొనసాగుతున్నాయి.
– పండిట్ మద్నూరే, భూగర్భ జలవనరులశాఖ రాష్ట్ర సంచాలకుడు