Weather Alert | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వడగండ్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. తెలంగాణకు గురు, శుక్రవారాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో వడగండ్ల వాన పడుతుందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పగలు ఎండ, సాయంత్రం వాన కురుస్తున్నది. గురువారం రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రలు 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.