హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను దివ్యాంగులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ‘ట్రై టూర్’ పేరిట ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తున్న డీ హబ్ ఫౌండర్ కొప్పుల వసుంధర శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. డాక్యుమెంటరీ అంశాలను మంత్రికి వివరించారు. దివ్యాంగులకు ప్రతిరంగంలో అనుకూల వాతావరణం కల్పిస్తూ, వారి అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో దివ్యాంగులకు ఉన్న వసతులు, ఇంకా కావాల్సిన సదుపాయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దదానికి డీ హబ్ సంస్థ ఈ ట్రై టూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. డీ హబ్ సంస్థ ఫౌండర్ వసుంధర దివ్యాంగురాలైనప్పటికీ ఆమె కృషి ఎంతో గొప్పదని అభినందించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం, సమాజం అభివృద్ధి కోసం పనిచేస్తున్న వసుంధర, నరేందర్ దంపతులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.