Minister Srinivas Goud | గీతవృత్తిలో మరణాలు, ప్రమాదాలను నివారించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. తాటిచెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయి వందలాది మంది చనిపోతున్నారని, శాశ్వత అంగవైకల్యం బారినపడుతున్నారన్నారు. ఈ మరణాలు, ప్రమాదాలను తక్షణమే నివారించేందుకు ప్రపంచంలోనే మెరుగైన, సులభతరమైన సేఫ్టీ యంత్రాలను పైలట్ ప్రాజెక్టు కింద అందించేందుకు వెంటనే నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
ప్రపంచంలో అనేక వృత్తులు ఆధునికత సంతరించుకున్నప్పటికీ గీత వృత్తి మాత్రం అదే సాంప్రదాయ పద్ధతిలో కొనసాగడంతో ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందని, అలాగే గీతవృత్తిని ప్రోత్సహించడం కోసం కార్మికులకు సేఫ్టీ యంత్రాలను తక్షణమే అందించేందుకు అవసరమైన కార్యచరణను రూపొందించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.