వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం (పీఎంఎస్ఎస్వై) కింద కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వరంగల్ నగరంలో నిర్మించిన హాస్పిటల్ భవనం ఐదో అంతస్థు పైకప్పు శుక్రవారం పెచ్చులూడింది. పీడియాట్రిక్ వార్డు ముందున్న లిఫ్ట్ భాగంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా సీలింగ్ తడిసి కూలినట్టు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ఈ దేవేంద్రకుమార్ వెంటనే దవాఖానను సందర్శించి పెచ్చులూడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్కడి సిబ్బంది శిథిలాలను తొలగించి, మరమ్మతు పనులు చేపట్టారు. హాస్పిటల్లో సేవలు మొదలైన ఏడాదిన్నరలోనే చిన్న పిల్లల వార్డులో సీలింగ్ కూలడంతో అటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు 2014 డిసెంబర్లో వరంగల్‌కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మం జూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో భాగంగా.. రూ.150 కోట్లతో కేంద్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో పనులను ప్రారంభించింది. ఆరు అంతస్థుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.30 కోట్లను ఇచ్చింది. ఈ భవనం నిర్మాణ టెండరు ప్రక్రియ, పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది. పనుల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకుండా నాణ్యత విషయాన్ని నిర్మాణ సంస్థకే వదిలేసింది. దీంతో సదరు నిర్మాణ సంస్థ పనులను తూతూమంత్రంగా చేపట్టింది. పనులను ఆరేండ్లపాటు కొనసాగించి.. ఎట్టకేలకు 2021 జూలైలో ఆ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. వెంటనే రాష్ట్ర సర్కారు ఇందులో వైద్య సేవలు ప్రారంభించింది. పది డిపార్టుమెంట్లకు 20 పడకల చొప్పున 200 పడకలను కేటాయించారు. ఇందులో అత్యవసర వైద్య సేవల కోసం 50 పడకలను వినియోగిస్తున్నారు. అయితే.. హాస్పిటల్ మొదలైనప్పటి నుంచే ఇందులో సమస్యలు తలెత్తుతున్నాయి. ఏసీ పైపుల లీకేజీపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా భవనాన్ని నిర్మించిన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. హాస్పిటల్లో అత్యవసరమైన లిఫ్ట్‌లు సైతం పని చేయడం లేదు.