హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 30 నుంచి ఆన్లైన్లో సెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని, మార్చిలో పరీక్ష నిర్వహిస్తామని సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ తెలిపారు. సెట్‌కు మొత్తం రెండు పేపర్లు ఉంటాయని, ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధి చొప్పున పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొదటి పేపర్లో 50 ప్రశ్నలుంటే 100 మార్కులు, రెండో పేపర్లో 100 ప్రశ్నలుంటే 200 మార్కులు ఉంటాయని వివరించారు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉంటుందని చెప్పారు. నోటిఫికేషన్ వివరాలను www.telanganaset.org వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు.