TS TET 2023 | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) తెలిపింది. బుధవారం నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. పేపర్ -1ను డీఐఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకోవచ్చు. బీఈడీ అర్హత కలిగిన వారు పేపర్ -2తోపాటు పేపర్ -1కు కూడా హాజరుకావొచ్చు. బీఈడీ, డీఐఈడీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాయొచ్చు. ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని ఎస్సీఈఆర్టీ వెల్లడించింది.
ఇటీవలే నిర్వహించిన విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణకు మార్గం సుగమమైంది. వివరాలకు www:// tstet.cgg. gov. in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.