హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి వివిధ శాఖలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధం ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ప్రజా పాలనలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి వివరాలను సేకరిస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించేందుకు ఇకపై హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందన్నారు. హెల్త్ ప్రొఫైల్‌కు వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ రూపొందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ దవాఖానల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలన్నారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి చర్చించారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం ఆదేశించారు. గోషా మహల్‌లోని పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న స్థలాన్ని వెంటనే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ చుట్టూ ఉన్న స్థలాన్ని పరిశీలించాలని, గోషా మహల్‌లోని పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అకడికి తరలించాలని సూచించారు. అనుభవజ్ఞులైన ఆరిటెక్ట్లతో దవాఖానకు డిజైన్లను తయారు చేయించాలని కోరారు. రాబోయే 50 ఏండ్ల అవసరాలను అంచనా వేసుకొని, కొత్త దవాఖాన నిర్మాణ డిజైన్లు ఉండాలని ఆదేశించారు. కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని, దవాఖాన చుట్టూ నలు వైపులా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. అన్ని విభాగాలతోపాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలన్నారు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే దవాఖానల పనులను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామం పకనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలన్నారు. సమీక్షలో సీఎస్ శాంతి కుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.