జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఈఈ సంపతి దిలీప్‌కుమార్ లంచం తీసుకుంటూ గు రువారం ఏసీబీకి చిక్కారు. ఆయనతోపాటు పనిచేస్తున్న ఏటీవో తాలాల చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ వలపదాసు శోభారాణిలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ పీ సాంబయ్య వివరాలు వెల్లడించారు. కాంట్రాక్టర్ కుంట సదానందం 2023లో తాడిచెర్లలో రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేశారు. రూ.10 లక్షల పనులు పూర్తి చేయగా అధికారులు రూ.5.83 లక్షలు చెల్లించారు.
ఇంకా రూ.4.17 లక్షల ఫైనల్ బిల్ రావాల్సి ఉంది. బిల్లు కోసం సదానందం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. బిల్లు చెల్లించాలంటే ఈఈ రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం.. కాంట్రాక్టర్ సదానందం పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లి ఈఈ దిలీప్ కుమార్‌కు రూ.10 వేలు, ఏటీవో చంద్రశేఖర్ కు రూ.5 వేలు, సీనియర్ అసిస్టెంట్ శోభారాణికి రూ.5 వేలు అందజేశాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే డబ్బులను స్వాధీ నం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని, శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు శ్యాం సుందర్, ఎస్ రాజు, ఎల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.