ఇబ్రహీంపట్నం, మే 28 : రంగారెడ్జిజిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్లకు చెందిన ఇమ్మిడి బాలకృష్ణ తనకు సంబంధించిన 7 గుంటల భూమి ఆన్లైన్లో రావడంలేదని ఆర్ఐ కృష్ణను ఆశ్రయించాడు. దీంతో ఆర్ఐ రూ.12 లక్షలు డిమాండ్ చేయగా రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
పని పూర్తి అయ్యిందని, డబ్బులు ఇవ్వాలని ఆర్ఐ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫోన్లో మాట్లాడిన విషయాన్ని రికార్డుచేసి ఆధారాలను ఏసీబీకి సమర్పించారు. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కార్యాలయానికి వచ్చి ఆ భూమికి సంబంధించిన ఫైల్‌ను స్వాధీనం చేసుకుని, ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీ తెనాలిలో దళిత యువకులను చితకబాదిన పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ముగ్గురు దళిత యువకులను నడిరోడ్డుపై పోలీసులు కొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎన్హెచ్ఆర్సీకి బుధవారం ఫిర్యాదుచేశారు. ఎన్హెచ్ఆర్సీ త్వరలోనే విచారణ చేపడతామని వెల్లడించింది. దళిత యువకులను పోలీసులు రోడ్డుపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.