నిజామాబాద్ క్రైం, జూన్ 30 : ఇసుక ట్రాక్టర్‌ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తాసిల్దార్ ఎం రమేశ్ ఇంటిపై దాడి చేశారు. ఇందల్వాయి మండలానికి చెందిన సతీష్ ఇసుక ట్రాక్టర్‌ను తాసిల్దార్ ఆదేశాలతో సిబ్బంది సీజ్ చేశారు. తన ట్రాక్టర్‌ను రిలీజ్ చేయాలని సతీష్ తాసిల్దార్ రమేశ్‌ను కోరగా రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఐ బషీర్ అలీ ఖాన్ సైతం డబ్బులు అడిగారు. చివరకు రూ.25 వేలు వాల్టా అకౌంట్లో జమ చేయాలని చెప్పడంతో బాధితుడు సతీష్ ఆ డబ్బులు వాల్టా అకౌంట్లో వేసిన అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ రమేశ్, ఆర్ఐ బషీర్ అలీ ఖాన్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జి డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. ముందుగా ఇందల్వాయి తాసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం నిజామాబాద్‌లోని తాసిల్దార్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
జల్పల్లి కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు!
లంచం తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ శివారులోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ కుమార్ ఏసీబీ అధికారులు పట్టుపడినట్టు తెలిసింది. ఈ మేరకు గురువారం కమిషనర్ నివాసాలతోపాటు సమీప బంధువులు ఆయన పీఏ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. సోదాలో భారీగా ఆస్తులను గుర్తించినట్టు ప్రచారం జరుగుతున్నది. పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
సీబీఐకి చిక్కిన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్
5 లక్షలు లంచం తీసుకొంటుండగా పట్టివేత
ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జిల) నిర్మాణ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు లంచం డిమాండ్ చేసిన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ పీఆర్ సురేశ్‌ను సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు రైల్ నిలయంలో బాధిత కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు తీసుకొంటుండగా సీబీఐ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్-జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను హబ్సిగూడకు చెందిన టీ జగదీశ్వర్ రావు అండ్ కో సివిల్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తున్నది. సదరు కాంట్రాక్ట్ గడువు పొడిగించేందుకు చీఫ్ ఇంజినీర్ సురేశ్ లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు వల పన్నిన సీబీఐ అధికారులు చీఫ్ ఇంజినీర్ సురేశ్‌ను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.