హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులపై (RTA check posts ) ఏసీబీ అధికారులు( ACB) ఏకకాలంలలో దాడులు నిర్వహించడం సంచలనం రేపింది. కామారెడ్డి ( Kamareddy) జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
వారి వద్ద నుంచి రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం ( Khammam) ఉమ్మడి జిల్లాలోని రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్ పోస్ట్‌లపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం చెక్‌పోస్ట్ లు ఎత్తి వేసినా చెక్‌పోస్ట్‌లు కొనసాగిస్తుండడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లాలో..
జిల్లా పరిధిలోని కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో గల కృష్ణ ఆర్టీఏ చెక్ పోస్టులో శనివారం అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. అర్ధరాత్రి 12:30నుంచి ఉదయం 6గంటల వరకు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీతో పది మంది బృందంలోని సభ్యులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఉన్న రూ.30,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్‌పోస్టు పై ఏసీబీ అధికారులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు.వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసి నగదును పట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెకోపోస్టుల పై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడంపల్లి మండలం మాడి అంతర్రాష్ట్ర ఆర్టీ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో రూ.43,300 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్‌పోస్ట్ మీదుగా ముంబై, హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ..
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించి రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.