వినాయక్‌నగర్, ఆగస్టు 9: నిజామాబాద్ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పట్టుబడ్డ నగదు, నగలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. కార్పొరేషన్లో బిల్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్ఐగా, తర్వాత సూపరింటెండెంట్ వరకు సుమారు దశాబ్ద కాలంగా ఇక్కడే పని చేస్తున్న దాసరి నరేందర్.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని నేరుగా ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందింది. ఈ మేరకు దాసరి నరేందర్ నివాసంతోపాటు సంబంధీకుల ఇండ్లు, ఆఫీస్ చాంబర్లో శుక్రవారం తెల్లవారుజామున 25 మందితో కూడిన ఏసీబీ అధికారుల బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో రూ.6 కోట్లకు పైగా విలువైన ఆస్తులు వెలుగుచూశాయి.
జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్ ఏరియాలో ఆర్ఐ నివాసమంటున్న అపార్ట్మెంట్లో, కోటగల్లిలో ఉంటున్న తల్లి నివాసంలో, నిర్మల్ జిల్లాలోని అత్తగారింట్లో సోదాలు జరిగాయి. నరేందర్ నివాసంలో ఎక్కడ చూసినా రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. వాటిని కౌంటింగ్ మిషన్లతో లెక్కించడానికే ఐదు గంటలకు పైగా సమయం పట్టినట్టు తెలిసింది. 11 గంటలకు పైగా జరిగిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదుతోపాటు రూ.6 లక్షల విలువైన 51 తులాల బంగారు ఆభరణాలు, భార్య, తల్లి పేరిట బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ రూ.1.10 కోట్లు, రూ.1.98 కోట్ల విలువ చేసే ఆస్తిపత్రాలను సీజ్ చేసినట్టు ఏసీబీ డీఎస్సీ శేఖర్‌గౌడ్ వివరించారు. మరిన్ని సోదాలు జరుగుతున్నాయని, నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచామని తెలిపారు. ఓ స్థాయి ఉద్యోగి వద్ద ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు లభించడం ఏసీబీ రికార్డులో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు.