హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ‘మీరు పదే పదే అవే ప్రశ్నలు అడిగినా, నా దగ్గర ఉన్న సమాచారం ఒక్కటే. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. అవినీతే లేని కేసును ఏసీబీ ఎలా టేకప్ చేస్తుంది? అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకైనా నేను సిద్ధమే. ఒకవేళ నన్ను జైలుకు పంపాలన్నది ప్రభుత్వ ఉద్దేశమే అయితే ఈ డొంకతిరుగుడంతా ఎందుకు? నేరుగా నన్ను అరెస్టు చేసుకోవచ్చు. తెలంగాణ కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉంటా. మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా’ అని ఏసీబీ అధికారులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా-ఈ రేస్‌కు స్పాన్సర్లు రాకుంటే రేస్ నిర్వహణకు నిధులు ఇవ్వాలని హెచ్ఎండీఏకు తానే మౌఖిక ఆదేశాలు ఇచ్చానని పదేపదే చెప్పిన విషయాన్ని, మీడియా సమక్షంలో చెప్పిన అంశాలను ఏసీబీ అధికారులకు కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది.
‘ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి వెళ్లిన నిధుల్లో అవినీతి ఎక్కడుందో మీరే చెప్పాలి? పైగా ఆ డబ్బులు కూడా ఎక్కడికీ వెళ్లలేదు’ అని ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగినట్టు తెలిసింది. అయిప్పటికీ వారు అడిగిన 60కి పైగా ప్రశ్నలకు కేటీఆర్ ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చారని సమాచారం.
సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ను ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి పర్యవేక్షణలో జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, విచారణాధికారి డీఎస్పీ మాజిద్‌ఖాన్ నేతృత్వంలోని విచారణ బృందం సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు మళ్లీ విచారణ కొనసాగించారు. లాయర్ రామచందర్‌రావుతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌తోపాటు, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ దానకిషోర్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నలు అడిగారు. రెండో విడత కూడా మళ్లీ అవే పాత ప్రశ్నలు అడిగినా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
‘ఈ మొత్తం ప్రక్రియలో చట్ట వ్యతిరేకమైన అంశం ఏదీ లేదు. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ పరమైన విచారణ చేస్తే సరిపోతుంది. ఎక్కడా పైసా అవినీతి లేనప్పుడు ఇందులో చట్టవ్యతిరేకత ఎక్కడుంది?’ అని కేటీఆర్ ఏసీబీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ‘మీరు ఈ కార్యాలయంలో ఎన్ని గంటలు కూర్చోమన్నా కూర్చుంటాను. ప్రభుత్వం నన్ను అరెస్టు చేయమని ఆదేశాలు ఇస్తే ఈ ప్రశ్నలు అడగడం అనేది వృథా ప్రయాస’ అని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ‘మీరు పదేపదే అవే ప్రశ్నలు అడిగితే నా సమాధానం కూడా అదే. ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాజనితంగా ప్రశ్నలు అడగడం వలన ఈ కేసు విచారణ ముందుకు పోదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదు’ అని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
కేటీఆర్ సమాధానాలతో సంతృప్తి చెందని ఏసీబీ అధికారులు కేటీఆర్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఆయన మునిసిపల్‌శాఖ మంత్రిగా 2023లో రేస్ నిర్వహించే నాటికి వాడిన ఫోన్లను తమకు అప్పగించాలని ఆదేశించినట్టు సమాచారం. వాటిని ఈనెల 18న తమకు సమర్పించాలని కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఏసీబీ నోటీసులు అందించే అవకాశం ఉంది. మళ్లీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేసి, అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.