హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రెవెన్యూశాఖలో మరో అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ. వంద కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్(ఎస్సార్వో-1) మధుసూదన్‌రెడ్డి భారీగా ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతా నిర్ధారించుకున్న తర్వాత శుక్రవారం తెల్లవారుజాము నుంచే అతని ఇండ్లతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లల్లోనూ దాదాపు 8 చోట్ల సోదాలు చేపట్టి సుమారు రూ.7.83 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.
వాటి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని అక్రమాస్తులపై ఆరా తీయగా, భారీగానే కూడబెట్టినట్టు గుర్తించారు. కాప్రాలోని భవానీనగర్ కాలనీలో 300 గజాల స్థలంలో నిర్మించిన భారీ త్రిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ (జీ+2)ను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు.
మధుసూదన్‌రెడ్డి తన అక్రమ సంపాదనను వివిధ వ్యాపారాల్లోకి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పనంగా సంపాదించిన సొమ్ముతో ఏఆర్కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రూ.80 లక్షల పెట్టుబడి పెట్టడమే కాకుండా తన భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలను(నకిలీ కంపెనీలు) సృష్టించినట్టు ఏసీబీ ధ్రువీకరించింది. శుక్రవారం జరిగిన సోదాల్లో మధుసూదన్‌రెడ్డికి సంబంధించి భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. ఆ డాక్యుమెంట్ల ప్రకారం వాటి విలువ రూ.7.83 కోట్లు ఉండగా, బహిరంగ మారెట్ విలువ అంతకంటే ఎన్నో రెట్లు ఎకువగా ఉంటుందని అంచనావేశారు.
అతని ఇంటితోపాటు బంధువుల ఇండ్లల్లో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.9 లక్షల లిక్విడ్ క్యాష్ దొరికిందని ఏసీబీ అధికారులు చెప్పారు. సుమారు కేజీకి పైగా బంగారం దొరికిందంటే అతని అక్రమ సంపాదన ఎంతలా ఉందో తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నదని, మరిన్ని అదనపు ఆస్తుల వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఏసీబీ అదుపులోకి తీసుకున్నది. అతనిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ చారుసిన్హా విడుదల చేసిన ప్రకటనలో అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.