కోదాడ/ కామారెడ్డి, జనవరి 24: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం తిరిగింది. గంట తర్వాత సివిల్ సప్లయ్స్ ఆఫీస్‌లోకి వెళ్లిన అధికారులు.. అక్కడి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని, రికార్డులను పరిశీలించారు.
సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి బకాయి పడిన రైస్‌మిల్లర్ల వివరాలు సేకరించినట్టు తెలిసింది. సూర్యాపేట జిల్లా కోదాడలోని అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని మీ సేవ కేంద్రం వేదికగా లేబర్ కార్డుల జారీ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు.
సోదాల్లో భాగంగా కీలక ధ్రువపత్రాలు, అధికారిక దస్ర్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నదని ఏసీబీ అధికారులు వెల్లడించారు.