హైదరాబాద్/అశ్వాపురం/మంథని, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు, సర్వేయర్‌ను ఏసీబీ పట్టుకున్నది. వీరిలో ఒకరు ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన అధికారి కాగా మరొకరు వ్యవసాయాధికారి. ఓ వ్యక్తి తనకు రావాల్సిన రూ.33,32,350 బిల్లును క్లియర్ చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ బొప్పూరి ఆనంద్‌కుమార్‌ను కోరాడు. దీంతో ఆనంద్‌కుమార్ లంచం (రూ.1,33,000) డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
గురువారం ఆనంద్‌కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఆనంద్‌కుమార్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టే అవకాశమున్నట్టు తెలిసింది. మరో ఘటనలో పత్తి విక్రయించేందుకు కూపన్ ఇవ్వాలని ఓ రైతు మండల వ్యవసాయాధికారిని కోరగా లంచం డిమాండ్ చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో చోటుచేసుకున్నది. రూ.30 వేలు ఇస్తేనే కూపన్ ఇస్తానని వ్యవసాయాధికారి సాయి శంతన్‌కుమార్ చెప్పడంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
దీంతో గురువారం రైతు నుంచి వ్యవసాయాధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఇంకో ఘటనలో భూమి సర్వే రిపోర్టు కోసం లంచం డిమాండ్ చేసిన సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకున్నది. సర్వేయర్ జాటోతు గణేశ్ మంథని రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద ఎకరం భూమిని కొలిచేందుకు రైతు సువర్ణ క్రాంతి దగ్గర రూ.17 వేలు డిమాండ్ చేశాడు. ఈ నెల 5న రూ.9 వేలు తీసుకున్నాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. రూ.3వేలను సర్వేయర్‌కు రైతు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హాండెడ్గా పట్టుకున్నారు.