వనపర్తి టౌన్, ఏప్రిల్ 23 : రైస్‌మిల్లుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకుగానూ లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఈ బాలకృష్ణ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్ శివారులోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ (రైస్ మిల్లు)కు 55 కేవీ విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకుగానూ సలీం అనే వ్యక్తి కాంట్రాక్టును దక్కించుకున్నాడు. పనులు పూర్తిచేశాక కనెక్షన్ ఇవ్వాలని ఖిల్లాఘణపురం విద్యుత్ శాఖ ఏఈ కొండయ్యను కోరగా ఆయన రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో మొదటి విడతగా సలీం రూ.30 వేలు చెల్లించాడు.
మిగితా రూ.20 వేలు ఇస్తేనే కనెక్షన్ ఇస్తానని ఏఈ చెప్పడంతో చేసేదేమీ లేక సలీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం బుధవారం వనపర్తిలో ఏఈ కొండయ్యకు రూ.10 వేలు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబీ డీఈ సూచించారు.