హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1064 సేవలు ఇక నుంచి 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. ఏసీబీ హెల్ప్ డెస్క్ (కాల్ సెంటర్) కోసం ప్రత్యేకంగా గది, ఇతర సదుపాయాలు కల్పించడంతోపాటు ఇద్దరు అదనపు సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. గతంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకే ఏసీబీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉండేదని, దీంతో లంచం డిమాండ్ చేసిన ఓ అధికారిపై సోమవారం రాత్రి రియాజుద్దీన్ అనే నెటిజన్ ఏసీబీ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు సంశయించాడని వివరించారు.
రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకే ఏసీబీ హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయన్న భావనతో కేవలం మిస్డ్‌కాల్‌తో సరిపెట్టానని, దీంతో ఏసీబీ సిబ్బందే అనూహ్యంగా తన నంబర్‌కు కాల్ చేసి, ఆ లంచగొండి అధికారి వివరాలను తీసుకోవడంతోపాటు ఆయనను పట్టుకునేందుకు ఎలా ముందుకెళ్లాలో కూడా దిశానిర్దేశం చేశారని రియాజుద్దీన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ విషయంలో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ తన పోస్టుకు ఆయనను ట్యాగ్ చేశాడు.
దీంతో రియాజుద్దీన్ పోస్టును సీవీ ఆనంద్ రీపోస్టు చేశారు. గతవారం ఏసీబీ పనితీరుపై సమీక్షించి, హెల్ప్‌లైన్ నంబర్ 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లంచాల కోసం వేధించే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఇక ఏ సమయంలోనైనా ఏసీబీ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు.