హైదరాబాద్ : గత నెల రూ. 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) కి పట్టుబడ్డ శామీర్పేట తహసీల్దార్ సుచరిత ( MRO Sucharita ) ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులున్నట్లు ( Illegally Assets ) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నాలా కన్వర్షన్ కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసి రూ.2 లక్షలు లంచం తీసుకున్న సుచరిత ప్రస్తుతం సస్పెన్షన్కు గురై ఏసీబీ కేసులో జైల్లో ఉన్నారు. హైదరాబాదులోని ఆమె నివాసాలతో పాటు వారి బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కీసర, ఖానాపేట్లో మూడు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.
రూ.12 లక్షల నగదు, రెండు కార్లు, కోటి 20 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు, బ్యాంక్బ్యాలెన్స్ 38 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, మార్కెట్లో అనేక రెట్లు ఉంటాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు.