చాంద్రాయణగుట్ట/లింగాల, ఆగస్టు 18: అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా లంచాలు మాత్రం ఆగడంలేదు. ఓ వ్యక్తి నూతన భవన నిర్మాణం కోసం పర్మిషన్ కావాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సంతోష్‌నగర్ సర్కిల్-25 టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి కోరాడు. సూపర్వైజర్ ప్రభావతి పర్మిషన్ కోసం రూ.20 వేలు లంచంగా అడిగింది. దీంతో మంగళవారం చాంద్రాయణగుట్ట నర్కీపూల్బాగ్లో ప్రభావతికి రూ. 20 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు ప్రభావతిని పట్టుకుని నాంపల్లి ఎస్పీఈ,ఏసీబీ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. జూలై 23న లింగాల మండలం రాయవరం నల్లమల అటవీ ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు మూడు బండ్లలో కలప తరలిస్తుండగా అటవీశాఖ సెక్షన్ అధికారి రాంబాబు, ఫారెస్టు బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ పట్టుకున్నారు. వీరి వద్ద బేరసారాలు ఆడి రూ.50 వేలు లంచం తీసుకున్నారు. లింగాల అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి, సదరు అధికారులపై కేసు నమోదుచేశారు.