కరీంనగర్ రాంనగర్, జూలై 9 : సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన మెజర్మెంట్ బుక్ అందించేందుకు కాంట్రాక్టర్ నుంచి ఓ అసిస్టెంట్ ఇంజినీర్ గురువారం రూ.10 వేల లంచం తీసుకోగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో సీసీరోడ్డు నిర్మాణం కోసం ఓ కాంట్రాక్టర్ రూ.10 లక్షల్లో పూర్తి చేసేందుకు అనుమతి పొందాడు. పీఆర్శాఖలో పైడి సతీశ్ చొప్పదండి పూర్తి స్థాయి అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
రామడుగు, గంగాధర, చొప్పండి డివిజన్‌కు ఇన్చార్జి డీఈగా కొనసాగుతున్నాడు. నాగిరెడ్డిపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం కోసం 4 నెలల కింద సతీశ్ సర్వే చేసి వివరాలను ఎంబీ బుక్‌లో రికార్డు చేశాడు. కమిషన్ కింద రూ.20 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాం ట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. గురువారం ఏఈ ఇంటి సమీపంలోనే కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేల లంచం తీసుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. శుక్రవారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నారు.