సుబేదారి, ఏప్రిల్ 20 : హనుమకొండలోని వడ్డేపల్లిలో గల వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సోమవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా సబ్ రిజిస్ట్రార్లు దావులూరి ఆనంద్, జమాలపురం నరసింహారావు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన విషయం తెలిసిందే. భూముల క్రయ విక్రయాల్లో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వాట్సాప్ మెసేజ్‌లు పంపి, ఫోన్‌పే ద్వారా రూ.16.23 లక్షలు వసూళ్లకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆనంద్ కుటుంబ సభ్యుల పేరుమీద నక్కలగుట్టలో రూ.72 లక్షల విలువ చేసే వాణిజ్య స్థలాలు ఉండటంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని వారు పేర్కొన్నారు. దీంతో ఆనంద్, నరసింహారావును ఆర్వో కార్యాలయంలో అరెస్ట్ చేశామని, మంగళవారం వరంగల్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
గంగాధర, ఏప్రిల్ 20: కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని పలు రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.