హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ మరో వింత నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలోని అకడమిక్ పోస్టులను సైతం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌తో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, రాబోయే సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్(బీజీ)లో వాటిని ఆమోదించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్సీ గురుకుల సొసైటీ నిర్వహణకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ(ఏడీ)-2, జాయింట్ సెక్రటరీ(జేఎస్)-5, డిప్యూటీ సెక్రటరీ(డీఎస్)-6, అసిస్టెంట్ సెక్రటరీ-5 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల్లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, అకడమిక్ విభాగాల పోస్టులు ఉంటాయి. ఆయా పోస్టులను ఏ ప్రాతిపదికన భర్తీ చేయాలనేదానిపై కూడా 2017లోనే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
సొసైటీలో మొత్తం ఆరు డిప్యూటీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. అందులో ప్రమోషన్ల ద్వారా నాలుగు, డిప్యూటేషన్‌తో రెండు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. ఈ 4పోస్టుల్లోనూ 3 అకడమిక్ నుంచి వచ్చిన వారికి అంటే రెండేండ్లకు పైగా అనుభవమున్న గ్రేడ్-1 ప్రిన్సిపాల్స్‌కు ప్రమోషన్లను కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మిగిలిన ఒక పోస్టును అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీకి ప్రమోషన్ కల్పించి భర్తీ చేస్తారు. ఇప్పటివరకు అదే విధానాన్ని పాటిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా డీఎస్ పోస్టులన్నింటినీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌తోనే భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ప్రధాన కార్యాలయంలో టీచింగ్ స్టాఫ్ ఎవరినీ అనుమతించబోమని ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. తదనుగుణంగా ఇటీవల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 4డీఎస్ పోస్టులను సైతం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌తోనే ప్రమోషన్లను కల్పించి భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై విద్యావేత్తలు, సొసైటీలోని ప్రిన్సిపాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ నిర్ణయాలు సొసైటీని నిర్వీర్యం చేస్తాయని, తక్షణం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.