హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని(ఉపా) కేంద్ర ప్రభుత్వం అధ్యాపకులు, విద్యావేత్తలు, స్కాలర్లపై మోపుతున్నద ని ‘ఫ్రీ టు థింక్’ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న అధ్యాపకులు, స్కాలర్లను ఉపా చట్టం కింద అక్రమంగా నిర్భందిస్తున్నదని తెలిపింది. ప్రొఫెసర్ సాయిబాబా నిర్బంధాన్ని సైతం ఉదహరించింది. అమెరికాకు చెందిన స్కాలర్ ఎట్ రిస్క్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. దాదాపు 40 దేశాల్లోని 550 యూనివర్సిటీలతో ఈ సంస్థ అనుబంధాన్ని కలిగి ఉన్నది. ఆయా యూనివర్సిటీల్లో జరిగే దా డులను, విద్యావేత్తల అభిప్రాయాల ను సేకరించి వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఆగస్టు 31 వరకు ఆ యా దేశాల్లోని యూనివర్సిటీల్లో జరిగిన ఘటనలను వివరిస్తూ ఇటీవలే నివేదికను విడుదల చేసింది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపిన పర్యావరణ కార్యకర్త దిశా రవిపై కేంద్రం వ్యవహరించిన తీరును నివేదికలో ఉటంకించింది. ఆమె పాస్‌పోర్ట్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రాసెస్ చేయకుండా గ్లాస్గోలో ఇటీవల జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశానికి హా జరు కాకుండా అడ్డుకొన్నదని పేర్కొన్నది. భారత్‌లోని అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నదని, సిలబస్ మార్పు, వీసీల నియామకాలు, అపాయింట్మెంట్లు అన్నీ రాజకీయ ప్రభావంతో జరుగుతున్నాయని నొక్కిచెప్పింది. యూజీసీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త సిలబస్ కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కాషాయీకరణ చేసేలా ఉన్నదని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది విద్యావేత్తలపై 332 సంఘటనలు నమోదయ్యాయి. కేసులన్నీ జాతీయ భద్రత కోసం రూపొందించిన కఠిన చట్టాల కింద పెట్టినవే కావటం గమనార్హం.