ఖైరతాబాద్, ఏప్రిల్ 5: అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్య వేదిక చైర్మన్ రూప్సింగ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అంటూ రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేవెళ్ల డిక్లరేషన్తోపాటు ఆదివాసీ, గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు రోటరీ చౌరస్తాలోని ఇందిరా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రూప్సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ మైదాన ప్రాంత ఐటీడీఏలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తుకారాం ఆదివాసీ, శ్రీ సంత్ సేవాలాల్, ఎరుకల ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని, పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్ పాసైనవారికి రూ.15 వేలు, డిగ్రీ పూర్తిచేసిన వారికి రూ.25 వేలు, పోస్టుగ్రాడ్యుయేట్లకు రూ.1 లక్ష, పీహెచ్డీ చేసిన వారికి రూ.5 లక్షలు అందజేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమం లో నేతలు లోకిని రాజు, డాక్టర్ కత్తి మల్లయ్య, ఆత్రం యాదగిరి, రామకృష్ణ, కుతాడి రవికుమార్, ప్రకాశ్, నర్సింహ, రమేశ్, మల్లయ్య, సూరజ్ పాల్గొన్నారు.