Abhaya Hastham | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన దరఖాస్తులో శివుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన మరువకముందే.. తాజాగా సోనియాగాంధీ పేరిట ఓ ఆకతాయి నింపిన అభయహస్తం ఫారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దరఖాస్తుదారు సోనియాగాంధీ, కొడుకులుగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురుగా కొండా సురేఖ, అల్లుడిగా మంత్రి శ్రీధర్‌బాబు పేరుతో దరఖాస్తును నింపారు.
ఈ దరఖాస్తు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది ఓ ఆకతాయి చేసిన పనేనని, దరఖాస్తు సంఖ్య లేకుండా ఖాళీ దరఖాస్తు ఫారంలో వివరాలు నింపి ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసినట్టు నెటిజన్లు తేల్చారు. కాగా, ఇటీవల దరఖాస్తు ఫారంలో విచిత్రాలు చర్చకు దారితీస్తున్నాయి. కొందరు అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత వివరాలు నింపేటప్పుడు.. వృత్తి అనగానే ఖాళీ దగ్గర ‘ఇంటికాడనే ఉంటది’ అని, గృహ వినియోగ విద్యుత్తు మీటర్ కనెక్షన్ సంఖ్య అనే కాలమ్ దగ్గర ‘దొరకలేదు’ అని విచిత్ర సమాధానాలతో ఫామ్ నింపారు. ఈ దరఖాస్తు ఫారాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.