Terrorist | హైదరాబాద్ సిటీబ్యూరో/సైదాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం కలకలాన్ని రేపింది. దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నిన కేసులో పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రిజ్వాన్ అలీని వెంటబెట్టుకుని ఆదివారం ఉదయం ముంబై నుంచి 3 వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్ పోలీసుల సహకారంతో సైదాబాద్ శంకేశ్వర్‌బజార్‌లోని గ్రీన్‌వ్యూ అపార్టుమెంట్లో గంటకుపైగా తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాల తయారీలో నిష్ణాతుడైన రిజ్వాన్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఐసిస్ తరఫున పుణె నుంచి కార్యకలపాలు నిర్వహిస్తున్న రిజ్వాన్ గతంలో కొంత కాలంపాటు సైదాబాద్‌లో ఉన్నట్టు ఎన్ఐఏ విచారణలో తేలడంతో అతని వివరాల కోసం గ్రీన్‌వ్యూ అపార్ట్మెంట్ యజమానితోపాటు ఆ చుట్టుపక్కల వారిని ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. సైదాబాద్‌లోని కుర్మగూడ ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఫర్హతుల్లా ఘోరీతో రిజ్వాన్‌కు పరిచయం ఉన్నది.
ఈ నేపధ్యంలో ఘోరీ ఈ ఏడాది మార్చిలో రిజ్వాన్‌ను హైదరాబాద్ పంపడంతో అతను సైదాబాద్‌లో కిరాయి ఇండ్లను వెతికాడు. శంకేశ్వర్‌బజార్‌లోని గ్రీన్‌వ్యూ అపార్టుమెంట్లో ‘టూ-లెట్’ బోర్డును చూసి ఆ ఫ్లాట్ యజమానిని సంప్రదించాడు. బట్టల వ్యాపారం చేస్తున్నానంటూ నమ్మించి రూ.4 వేలకు ఫ్లాట్‌ను కిరాయికి తీసుకున్నాడు. 6 నెలలపాటు అక్కడే ఉండి తరచూ కేరళ, ఉత్తరప్రదేశ్‌కు రాకపోకలు సాగించిన రిజ్వాన్.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా గత నెల మొదటి వారంలో హస్తినకు వెళ్లిన రిజ్వాన్‌ను ఢిల్లీ-ఫరీదాబాద్ సరిహద్దు ప్రాంతంలోని గంగాబక్ష్ వద్ద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 30 బోర్ పిస్టల్, 3 కార్ట్రిడ్జ్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రిజ్వాన్‌పై పుణెలో నమోదైన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. రిజ్వాన్‌పై రూ.3 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ పీటీ వారెంట్‌పై అతడిని అరెస్టు చేసి విచారణ జరపడంతో గతంలో 6 నెలలపాటు హైదరాబాద్‌లో ఉన్నట్టు వెల్లడించాడు.
ఢిల్లీ పోలీసులకు చిక్కిన అబ్దుల్ రిజ్వాన్ 2015-16లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఐసిస్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు చూసి ఆకర్షితుడయ్యాడు. అనంతరం సొంత రాష్ట్రమైన జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వచ్చి షహీన్‌బాగ్‌లో స్థిరపడిన రిజ్వాన్.. 2017లో అక్కడ షానవాజ్ అనే ఉగ్రవాదితో పరిచయం పెంచుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంతోపాటు ఐసిస్ మాడ్యుల్‌ను యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రకు విస్తరించడంలో కీలకపాత్ర పోషించాడు. నిరుడు జూన్‌లో పుణె పోలీసులు షానవాజ్ గ్యాంగ్‌లోని పలువురిని అరెస్ట్ చేసినప్పటికీ రిజ్వాన్ తప్పించుకున్నాడు. దీంతో రిజ్వాన్‌ను ఎన్ఐఏ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించి అతనిపై రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది.