హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : బడి చదువుల ఒడి. అంతేకాదు విద్యార్థి వికాసపు గుడి. ఈ మాటలను అక్షరాల నిజం చేస్తున్నది హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ మాడల్ ఆలియా ఉన్నత పాఠశాల. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బ్యాంకింగ్ పాఠాలు బోధిస్తూ ఆర్థిక సాక్షరతకు పునాదులు వేస్తున్నది. ప్రధానోపాధ్యాయుడు జీ విశ్వనాథంగుప్తా చొరవతో ఈ పాఠశాలలోని 6-9 తరగతుల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పాఠాలు నేర్పిస్తున్నారు.
ఓ ఎన్జీవో సహకారంతో వారంలో ఒక పీరియడ్‌ను కేటాయించి బ్యాంకింగ్ పాఠాలు చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు వర్క్‌బుక్స్ అందించడంతోపాటు ట్యూటర్‌ను నియమించారు. సైబర్ మోసాలను అరికట్టడంలోనూ తర్ఫీదునిస్తున్నారు. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బీమా సంస్థల సందర్శనకు విద్యార్థులను తీసుకెళ్తున్నారు. బ్యాంక్‌ఖాతాలు ప్రారంభించడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్‌కార్డుల వినియోగం, రుణ ప్రక్రియ, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుండడంతో పలువురి మన్ననలు అందుకుంటున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఈ నెల 17లోగా సవరించుకోవాలని ఇంటర్‌బోర్డు సూచించింది. విద్యార్థుల వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఏవైనా మార్పులుంటే సవరించుకోవాలని సూచించింది. విద్యార్థి పేరు, కులం, జెండర్, పుట్టినతేది, ఫొటో, ద్వితీయ లాంగ్వేజ్, ,మీడియం, గ్రూప్చేంజ్ వంటి వివరాలను సరిచూసుకోవాలని బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య సూచించారు.