Suicide | వరంగల్ : ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చెన్నరావుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నరావుపేట మండల పరిధిలోని ధర్మతండాకు చెందిన మహేశ్(21) గత కొన్నేండ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం మహేశ్‌కు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనతో ఆమెకు వివాహం కాదని నిర్ణయించుకున్న మహేశ్.. మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు మహేశ్ పురుగుల మందు తాగుతూ సెల్పీ వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పురుగుల మందు సేవించిన మహేశ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహేశ్ మృతితో ధర్మతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.