Prajapalana | నర్సాపూ ర్, జనవరి 4 : ఆరు గ్యా రెంటీల కో సం దరఖా స్తు చేసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి వస్తేనే దరఖాస్తు ఫారం ఇస్తామని అధికారులు చెప్పడంతో సదరు వ్యక్తి కంగుతిన్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అబ్బుగారి పోచయ్యకు రెండేండ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో ఇటీవల ఆమె పుట్టింటికి వెళ్లింది. పలుమార్లు భార్య వద్దకు వెళ్లి కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది.
ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గురువారం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. దరఖాస్తు ఇవ్వాలని పోచయ్య అధికారులను కోరగా.. ‘నీ భార్య వస్తేనే ఇస్తాం’ అని అధికారులు తేల్చి చెప్పడంతో అయోమయంలో పడ్డాడు. ఆ వెంటనే ఆయన భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లగా వాళ్లు పంపలేదు. అటు భార్య కాపురానికి రాక.. ఇటు ఆరు గ్యారెంటీల దరఖాస్తు పొందలేక పోచయ్య అయోమయంలో పడ్డాడు. భార్యలకే దరఖాస్తు ఇవ్వాలనుకున్న వారు దరఖాస్తు ఫారంలో పురుషుడు అనే కాలం ఎందుకు పెట్టారని పోచయ్య అధికారులను ప్రశ్నించాడు.
దరఖాస్తు ఫారం ఇవ్వడానికి ఏదైనా గుర్తింపు కార్డు తేవాలని కోరినట్టు పంచాయతీ కార్యదర్శి శ్వేత చెప్పారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో దరఖాస్తు ఇవ్వలేదని తెలిపారు. అంతకుముందు అతని తల్లి దరఖాస్తు తీసుకున్నదని, అదే కుటుంబంలో ఇంకో ఫారం ఇవ్వాలంటే అతని గుర్తింపు కార్డు ఏదైనా చూపాలని కోరినట్టు పేర్కొన్నారు.