ధర్మపురి, డిసెంబర్ 21 : ఓ వ్యక్తిని హత్య చేయడానికి సుపారీ కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు దారుణ హత్యకు రైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో చోటుచేసుకున్నది. ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరెళ్లకు చెందిన మెరుగు లక్ష్మణ్, కమలాపూర్‌కు చెందిన గోపాల్ ముంబైలో కల్లుడిపో నిర్వహిస్తున్నారు. ఓ రోజు లక్ష్మణ్.. గోపాల్‌తో మాట్లాడుతూ తన మరదలిని నేరెళ్లకు చెందిన తోకల గంగాధర్ వేధిస్తున్నాడని, అతడిని చంపడానికి సుపారీ మాట్లాడుదామని చెప్పాడు. దీనికి గోపాల్ తన స్నేహితుడైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్‌సింగ్ (27) అనే షూటర్‌తో రూ.4 లక్షల సుపారీ కుదుర్చుకున్నారు.
కొద్దిరోజుల తరువాత హత్య చేయాల్సిన అవసరం లేదని గోపాల్ చెప్పగా ఒప్పందం ప్రకారం రూ.4 లక్షలు ఇవ్వాల్సిందేనని, లేదంటే నీ తండ్రిని చంపుతానని సూర్యప్రకాశ్‌సింగ్ బెదిరించాడు. దీంతో గోపాల్ షూటర్‌ను అకౌంట్ సెటిల్ చేస్తానని ఈ నెల 12న నేరెళ్లకు తీసుకువచ్చాడు. 13న రాత్రి నేరెళ్ల అటవీప్రాంతంలో నేరెళ్లకు చెందిన శేఖర్, గోపాల్, సూర్యప్రకాశ్ మద్యం తాగారు. గోపాల్ బండరాయితో సూర్యప్రకాశ్ తలపై మోది హత్య చేశాడు. గ్రామానికి కొత్తగా కార్లు రావడం, రెండు రోజుల క్రితం వీరితో తిరిగిన వ్యక్తి కనిపించకపోవడంతో పోలీసులు విచారణ సాగించారు. దీంతో భయపడిని గోపాల్, శేఖర్ శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నేరం ఒప్పుకొని లొంగిపోయారు.