వైరా టౌన్ (ఏన్కూరు), డిసెంబర్ 1: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు భారత తూర్పు నౌకాదళంలో ఉద్యోగిగా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. కఠినమైన శిక్షణను ఎదుర్కొని సబ్ లెఫ్టినెంట్ ఇండియన్ నేవీగా ఉద్యోగం సాధించి తన ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాడు. అతడి పట్టుదలకు మెచ్చిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్.. శుక్రవారం కేరళలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రత్యేకంగా అభినందించి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఏన్కూరు మండలం నూకాలంపాడుకు చెందిన బాబూరావు, శ్రీదేవి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.
వీరి కుమారుడు ఆకాశ్ ప్రాథమిక విద్యను స్థానికంగానే పూర్తి చేసిన ఆకాశ్.. తొమ్మిదో తరగతిలో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సాధించాడు. డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో 10+2 పూర్తి చేశాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశపరీక్ష రాసి, కోల్‌కతాలో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ఎదుర్కొన్నాడు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ని ఎంచుకొని మహారాష్ట్ర పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో పూర్తి చేశాడు.
ఆసియాలోనే నంబవర్ వన్ అయిన కేరళ ఇఝిమలాలోని ఇండియన్ నావెల్ అకాడమీలో నౌకాదళ శిక్షణలో ఉత్తీర్ణత సాధించాడు. నవంబర్ 29న జరిగిన ఇండియన్ నావెల్ అకాడమీ కోర్సు 107వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ నుంచి పట్టా అందుకున్నాడు. నౌకాదళం అతడిని సబ్ లెఫ్టినెంట్ ఇండియన్ నేవీగా నియమించి ఏపీలోని విశాఖపట్నం తూర్పు నౌకాదళ కమాండ్‌కు కేటాయించింది.