చెన్నారావుపేట, జూలై 5: ఉద్యోగం వస్తుం దని తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమినాబాద్ గ్రామంలో చీర కళావతి-మల్లేశం దంపతులది వ్యవసాయ కుటుంబం. వారి కుమారుడు రంజిత్(25) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి పోటీ పరీక్షలు రాస్తూ హెదరాబాద్లో ఉంటున్నాడు.
ఇటీవల పలు పోటీ పరీక్షలు రాసినా ఎలాంటి ఫలితం లేక తనలో తానే కుంగిపోయాడు. అందరితో కలిసుంటే బాధను మరిచిపోతావని కడపలో స్నేహితుడి అక్క పెండ్లికి మిత్రులు తీసుకెళ్లారు. అయినా మానసిక ఒత్తిడితో ఉన్న రంజిత్ కడపలో తాను బస చేసిన హోటల్ గదిలో గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాక తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రంజిత్ మృతదేహం శుక్రవారం రాత్రికి స్వగ్రామం చేరుకుంటుందని, శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని గ్రామస్థులు తెలిపారు.