పెనుబల్లి, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి వేళాపాలా లేని కరెంటు ఇవ్వడం వల్ల విద్యుదాఘాతం, విషపురుగుల బారిన పడి రైతులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలో రాత్రి వేళ విద్యుత్తు మోటర్ బంద్ చేయడానికి పొలం వద్దకు వెళ్లిన ఓ యువ రైతు పాము కాటుకు గురై మృతిచెందాడు. గ్రామానికి చెందిన యువ రైతు కుంజా శివ(30) తనకున్న నాలుగెకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి పంటకు నీరందించే విద్యుత్తు మోటర్‌ను బంద్ చేసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ మోటర్ ఆఫ్ చేస్తుండగా శివను పాము కాటేసింది. అనుమానం వచ్చిన శివ సెల్‌ఫోన్ లైట్ ఆధారంగా చుట్టుపక్కల వెతకగా.. రక్తపింజర పాము కనిపించింది. వెంటనే దానిని చంపేశాడు. శివ ఇంటికి వస్తుండగా స్పృహతప్పి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
శివ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో.. మంగళవారం తన మేనకోడలు పెండ్లి ఉండటంతో అక్కడికి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. అక్కడికీ రాలేదని చెప్పారు. పొలం వద్ద ఉన్నాడనే అనుమానంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యంలో శివ మృతిచెంది కనిపించాడు. మృతుడు శివకు భార్య, కూతురు ఉన్నారు. శివ మృతి విషయమై కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు.