Telangana | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మద్యం కొరతపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది. గత పదేండ్లలో ఎన్నడూలేనివిధంగా ఇప్పుడు ఒకేసారి పలు కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతున్నది. వ్యూహాత్మకంగా రాష్ట్రంలో కొన్ని రకాల మద్యం బ్రాండ్లకు కొరత సృష్టించి.. ఆ సాకుతో కొత్త కంపెనీలకు గేట్లు ఎత్తారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మద్యం విధానంపై గతంలో ఎన్నో విమర్శలు ఉండేవి. తెలంగాణలో మాత్రం మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలుచేశారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన బీర్లు, ఆల్కహాల్ బ్రాండ్లు తెలంగాణలో లభించేవి. నగరం కాస్మొపాలిటన్ సిటీ కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా మ ద్యం కంపెనీలతో లాలూచీ పడలేదు. డిమాండ్‌కు అనుగుణంగా ఇండెంట్లు పెట్టారు. కానీ, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానంలో ఊహించని మార్పు వచ్చిందని మద్యం వ్యా పారులు చెప్తున్నారు. బీఆర్ఎస్ సర్కారున్నపుడు పెట్టిన ఇండెంట్లలో ఇప్పుడు అయిదో వంతు కూడా పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా బీర్లకు కృత్రిమ కొరత సృష్టించారని చెప్తున్నారు. కొరత తీవ్రం కావడంతో హఠాత్తుగా కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేశారని అంటున్నారు. కొత్త కంపెనీలకు ఎం దుకు అనుమతులు ఇచ్చారంటే.. పాత కంపెనీలు డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడంలేదన్న ప్రచారం మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు.
మద్యం కంపెనీలకు సకాలంలో ఎందుకు ఇండెంట్లు పెట్టలేదన్న ప్రశ్నకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం విస్మయం గొలుపుతున్నది. పాత బకాయిలు సుమారు రూ. 3000 కోట్లు ఉన్నాయని, అవి చెల్లించకపోవడంతో కంపెనీలు సరఫరా తగ్గించాయని పేర్కొంది. డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభు త్వం రాబడిని మాత్రమే చూసిందని, ఉద్దేశపూర్వకంగానే కంపెనీలకు బకాయిలను పూర్తిగా చెల్లించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బకాయిలు కేవలం రూ.2000 కోట్ల వరకు ఉంటాయని చెప్తున్నారు. ప్రభుత్వానికి ప్రతినెల మద్యం ద్వారా సుమారు రూ.3000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, ఒక్క నెల ఆదాయాన్ని పాత బకాయిలకు చెల్లించినా సరిపోయేదని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే బ్యాంకు ష్యూరిటీలు కూడా ఇచ్చి మద్యం కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుందని మద్యం వ్యాపారులు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి దాన్ని పాత ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేశారని విమర్శలు వస్తున్నాయి. కేవలం తమకు అనుకూలమైన సంస్థలను, వాటి బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకే పాత బకాయిలు చెల్లించకుండా.. ఇండెం ట్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కొందరు ప్రభుత్వ పెద్దల అండదండలతోనే జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో దాదాపు రెండు నెలలుగా బ్రాండెడ్ బీర్లు దొరకడం లేదు. అంతర్జాతీయంగా పేరున్న కింగ్‌ఫిషర్ లైట్ కోసం ఇండెంట్లు పెట్టిన దుకాణదారులకు రేషన్ పద్ధతిలో సప్లయ్ చేస్తున్నారు. ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే కొందరు ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్‌శాఖ వేసవి ప్రణాళికలకు అడ్డు తగిలారని సమాచారం. ఫలితంగా ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఏర్పడింది. కొందరు రేషన్ పద్ధతిలో వచ్చిన బీర్లను కొంత కమీషన్‌కు బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఇలా కమీషన్ల కోసం కొందరు వ్యాపారులు మళ్లీ సిండికేట్ అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో రూ.150-160 ధరకు వచ్చే బీర్లను బెల్ట్ షాపుల్లో రూ.200 పైగా ధరకు విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యాన్ని కృత్రిమంగా నిలిపివేసి కొత్త బ్రాండ్లను తీసుకురావాల్సిన అవసరం ఏమిటని మద్యం ప్రియులు ప్రశ్నిస్తున్నారు. కేఎఫ్ లైట్, స్ట్రాంగ్, అల్ట్రా, 5000, నాకౌట్, బడ్వైజర్, ఖజురహో, ఆఫీసర్స్ చాయిస్ వంటి ప్రముఖ బ్రాండ్ల సరఫరా తగ్గడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఏదో మతలబు ఉన్నదని, ముందే ఊహించామని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద సోం డిస్టలరీస్తోపాటు మరికొన్ని సంస్థలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. కొత్త కంపెనీల నుంచి వచ్చే 27బ్రాండ్ల బీర్ల వెనుక ఉన్న మతలబు ఏంటో వివరంగా చెప్పాలని ఇటు ప్రతిపక్ష నాయకులు, అటు మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఓ క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టినా కూడా.. ‘తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారు’ అని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపించేవారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి రావడంతోనే ప్రజాపాలన పేరుతో ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఎక్సైజ్శాఖపైనే ఆధారపడ్డారని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు. పన్నులు, ఫీజుల రూపంలో ఎక్సైజ్ శాఖకు ప్రతినెలా రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి కొన్ని పథకాలు అమలు చేసేందుకు తక్షణం నిధులు అవసరం కావడంతో మద్యంపై వచ్చే ఆదాయం లక్ష్యాన్ని ఏటా రూ.45వేల కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఒక్కో మద్యం షాపునకు రూ.50 లక్షల రాబడి టార్గెట్ ఉండాలని ప్రభుత్వ పెద్దలు పథకం రచించినట్టు తెలిసింది. ఈ విధంగా ప్రతిరోజు రూ.130 కోట్ల వరకు రాబడి వస్తే.. నెలకు రూ.3,900 కోట్లు.. ఏడాదికి రూ.46,800 కోట్లు రాబడి సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చారని చెప్తున్నారు.