హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం వీరి మధ్య యుద్ధానికి కారణమైంది. పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచాలంటూ కొంతకాలంగా ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం లాబీయింగ్ మొదలుపెట్టారు.
ఈ డిమాండ్‌ను పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పదవీ విరమణ వయస్సు పెంచితే కొత్త నియామకాలపై ఆ ప్రభావం పడుతుందని, తమలాంటి వాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రహించిన ప్రొఫెసర్లు తమ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై వాట్సాప్ గ్రూపుల్లో చర్చ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రొఫెసర్ విద్యార్థులపై ఘాటుగా స్పందించారు.
చదువుకోవాల్సిన పిల్లలకు ఇలాంటి వ్యవహారాలు ఎందుకంటూ ప్రశ్నించారు. విద్యార్థులు ధర్నాలు చేస్తే తాము కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి డిమాండ్ సాధిస్తామని స్పష్టంచేశారు. విద్యార్థులు ఇలాంటి విషయాలపై కాకుండా చదువుపై దృష్టి పెడితే బాగుంటుందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మార్కులు వేసి పరీక్షల్లో గట్టెక్కించినా కృతజ్ఞత, గౌరవం లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
విద్యార్థులకు అడ్డదారిలో మార్కులు వేసి పాస్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ప్రొఫెసర్ వ్యాఖ్యలపై విద్యార్థులు మండిపడుతున్నారు. తమను, తమ చదువులను కించ పరిచే విధంగా ప్రవర్తించిన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులకు అడ్డదారిలో మార్కులు వేసి గట్టెక్కించారో తేల్చాలని కోరుతున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ప్రొఫెసర్లు, విద్యార్థుల మధ్య గొడవ గురించే చర్చించుకుంటున్నారు.