చిగురుమామిడి/కమాన్‌చౌరస్తా(కరీంనగర్) మే 29: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి విద్య ప్రాముఖ్యతపై ప్రమోషనల్ వీడియో రూపొందించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ జడ్పీ ఉన్నత పాఠశాల హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్, కరీంనగర్ సుభాష్‌నగర్ జడ్పీ హైస్కూల్ తెలుగు టీచర్ మోతె చంద్రశేఖర్‌రెడ్డి, వేములవాడ రూరల్ మండలం వట్టెంల హైస్కూల్ హెడ్మాస్టర్ సూర్యనారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులకు సర్కారు విద్య ప్రాముఖ్యతపై వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించాలని సంకల్పించారు. ఈ దిశగా ఆధునిక పరిజ్ఞానాన్ని అంటే కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యావిధానం, సౌకర్యాలు, నాణ్యమైన బోధన తదితర అంశాలను వివరిస్తూ ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియా తయారు చేశారు. బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన సందర్భంలో తల్లిదండ్రులకు ఈ వీడియోను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్ తెలిపారు.