శాయంపేట, ఆగస్టు 1: డెంగ్యూ జ్వరంతో ఆరోగ్యం క్షీణించి ఓ నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో చోటుచేసుకుంది. ఆమె కడుపులోని కవల పిల్లలను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గ్రామానికి చెందిన బొమ్మకంటి శ్రీకాంత్‌తో పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన శిరీషకు రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. శిరీష ప్రస్తుతం నిండు గర్భిణి. మరో వారం రోజుల్లో ఆమె డెలివరీ కానున్నట్టు వైద్యులు డేట్ ఇచ్చారు. నాలుగు రోజులుగా జ్వరం రావడంతో ఒకసారి డాక్టర్‌కు చూపిద్దామని కుటుంబ సభ్యులు మూడు రోజుల కిందట హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు శిరీషను పరీక్షించి చికిత్స అందించారు.
డెంగ్యూ అనుమానంతో పరీక్షల నిమిత్తం షాంపిల్స్ పంపగా.. గురువారం ఉదయం వచ్చిన రిపోర్టుల్లో నిర్ధారణ అయింది. అప్పటి వరకు చికిత్స పొందుతున్న శిరీషకు ఒక్కసారిగా ప్లేట్లెట్స్ తగ్గిపోయి కోమాలోకి వెళ్లింది. శిరీష ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉండటంతో ఆమె కడుపులోని కవల పిల్లలను కాపాడేందుకు వైద్యులు సిజేరియన్ చేసి బయటకు తీశారు. కానీ ఇద్దరు ఆడ శిశువులు ప్రపంచాన్ని చూడకుండానే మృతి చెందారు. శిరీష పరిస్థితి విషమించి లోకాన్ని విడిచింది. శిరీష పెండ్లి రోజు మరునాడే.. కడుపులోని పిల్లలతోపాటు తిరిగిరాని లోకానికి వెళ్లడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.