వెంకటాపురం(నూగూరు), జూలై 4 : గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన మందుపాతర(ప్రెజర్ బాంబు) పేలి గిరిజనుడికి గాయాలైన ఘటన శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెం-చెలిమెల గుట్టల్లోని అటవీ ప్రాంతంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ముకునూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య అనే గిరిజనుడు కొందరితో కలిసి సమీపంలోని గుట్టల పైకి వెదురు బొంగులు తెచ్చుకునేందుకు వెళ్లాడు.
అనుకోకుండా మందుపాతరపై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలి కామయ్య ఎడమ కాలి పాదానికి తీవ్ర గాయమైంది. వెదురు బొంగుల కోసం వెళ్లిన మరికొంత మంది బాంబుపేలిన శబ్దం విని కామయ్య వద్దకు చేరుకొని జెల్లి కట్టి గుట్టపై నుంచి కిందికి మోసకొచ్చారు. 108 వాహనంలో మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.